భోజనం చేసే పద్ధతులూ, భోజనం దగ్గిర అలవాట్లూ దేశదేశానికీ మారుతూంటాయి. తెలుగు వాళ్లు అన్నం చేత్తో తింటారనీ, పీట మీద కూర్చుని భోం చేస్తారనీ మీకు తెలుసు. అయితే, అన్ని ప్రాంతాలలో లాగే ఇక్కడ కూడా భోజన మర్యాదలు కొన్ని వున్నాయి. వాటిని గురించి చెప్పడం కోసం ఈ వ్యాసం.
భోజనం చేసేటప్పుడు కుదురుగా మఠం వేసుకుని కూర్చోడం మర్యాద. కాళ్లు చాపుకుని కూర్చోడం, గొంతుక్కూర్చోడం, గోడకి చేరగిలబడి కూర్చోడం, ఇలాంటివి మర్యాద కాదు.
చాలా మంది ఇళ్లల్లో అన్నం కంచాల్లో తింటారు. కాని, ఇంటికి ఎవరేనా భోజనానికి వచ్చినప్పుడు అందరూ విస్తరిలో భోజనం చేస్తారు.
వడ్డన అంతా పూర్తి అయిందాకా తినడం మొదలు పెట్టకూడదు. వడ్డించేవి వడ్డించేట్టు తినడం మర్యాద కాదు. అన్నీ వడ్డించాక, మీతోపాటు భోజనానికి కూర్చున్న వాళ్లలో పెద్ద వాళ్లు తినడం మొదలు పెట్టేదాకా ఆగి, అప్పుడు మీరు తినడం మొదలు పెట్టాలి. పంక్తిలో మిగిలిన వాళ్లు భోజనం పూర్తి చేయకముందు మీరు తినేసి లేచిపోకూడదు. గబగబ తినెయ్యడం గాని, మరీ ఆలిస్యంగా తింటూ కూర్చోవడం కాని, మర్యాద కాదు.
కొందరి ఇళ్లలో వండిన వస్తువులు ఏవీ ఎడం చేత్తో ముట్టుకోరు. భోజనం కుడి చేత్తో చేస్తారు. మంచి నీళ్లు ఎడం చేత్తో తాగుతారు. మీది గాని ఒక వేళ ఎడం చెయ్యి వాటం అయితే సిగ్గు పడకండి.
వడ్డించే వాళ్లు మీ విస్తరిలో అయిపోయినవన్నీ మళ్లా తెచ్చి వేస్తూంటారు. మీకు అక్కర్లేకపోతే, “వొద్దండీ, ఇంక తినలేను” అని చెప్పొచ్చు. అయినా చాలా మంది వినరు. మీరు మొహమాట పడుతున్నారనుకుంటారు. “నాకు మొహమాటం లేదండీ, నాకు నిజంగా వొద్దు” అని చెప్పి చూడండి.
మీకు వడ్డించినవి ఎక్కువైపోతే వదిలెయ్యడం అమర్యాద కాదు. అయితే తినే వస్తువులు వృధా చెయ్యడం మంచిది కాదనే అభిప్రాయంతో చాలా మంది అలా వదిలెయ్యరు.
అన్నం తిన్నతర్వాత ఎంగిలి చెయ్యి నాకడం ఆట్టే మర్యాద కాదు. నమిలేటప్పుడూ జుర్రేటప్పుడూ పెద్ద చప్పుడు చెయ్యడం కూడా మర్యాద కాదు.
భోజనాలవేళ మాట్లాడకూడదనే నియమం లేదు కాని, భోజనాలు అయిపోయినతరవాత ఇంకా మాట్లాడుతూ విస్తరి దగ్గిరే కూర్చోకూడదు.
తెలుగు వాళ్ల భోజనంలో ఒక వరస వుంది. సాధారణంగా భోజనం పప్పుతో మొదలవుతుంది. పప్పు కలుపుకున్నాక, కూర, పచ్చడి, పులుసు - వరసగా కలుపుకుని తింటారు. ఆఖర్న మజ్జిగో పెరుగో వేసుకుంటారు. పిండి వంటలు ఉంటే అవి కొన్ని ముందు తింటారు. కొన్ని చివర తింటారు. వాటికి ఒక వరస లేదు.
తెలుగు దేశంలో చాలా మంది మాంసం తింటారు. అయితే, సాధారణంగా బ్రాహ్మల ఇళ్లల్లో మాంసంగాని, చేపలుగాని, ఆఖరికి కోడిగుడ్లుగాని తినరు. మాంసం తినడం తప్పు అని వాళ్ల విశ్వాసం. కొందరైతే మాంసం తింటున్న వాళ్ల పక్కన కూర్చుని భోజనం చెయ్యరు, మాంసం గురించి మాట్లాడరు. మరి కొందరున్నారు: వాళ్లు మాంసం తినరు గాని ఇతరులు తింటే వాళ్లకి అభ్యంతరం వుండదు.
ఆ సంగతి ఎలా వున్నా, బ్రహ్మాండంగా వంట చేసి కడుపు నిండా భోజనం పెట్టడం తెలుగు వాళ్లకి ఇష్టం. తెలుగు వాళ్లు భోజన ప్రియులు.
వడ్డన | n. “serving meals” |
టిక | n. “commentary; glossary” |
భోజనం చేసే పద్ధతులూ | “styles of eating food”
పద్ధతులు “methods, styles.” vowel lenghtening for “and” భోజనం “meal” భోజనం చేయు “to eat a meal” |
భోజనం దగ్గిర అలవాట్లూ | “table manners”
-దగ్గిర “near, at” అలవాట్లు n. pl. “habits, manners” sg. అలవాటు |
దేశదేశానికీ | “from country to country” |
మారుతూంటాయి | “change; vary”
మారు v. intr. “to change; vary” మారుతూంటాయి future progressive of మారు |
అన్నం | “meals; cooked rice” |
చేత్తో తింటారు | “eat with the hand”
చేత్తో “with the hand” చేతి + తో చేతి oblique of చెయ్యి “hand” |
అనీ | link word plus conjunctive vowel lengthening. అని + ఈ |
పీట మీద కూర్చుని | “sitting on a పీట”
పీట “a low rectangular stool about 3 inches high” -మీద “on” కూర్చుని nonfinite of కూర్చొను, “to sit |
ఇంకా ఉంది | To be continued ...
|